మీరు భయం ఎరుగని మనుషులను చూడాలనుకుంటున్నారా? అలసట ఎరుగని పాదాలను కలవాలనుకుంటున్నారా? ఉప్పొంగే సముద్రాలను ప్రతి రోజు ఢీ కొట్టే మనుషులు- తమ హృదయ స్పందనను అలల సవ్వడితో జత కలిపే మనుషులు- వీరిని కలవాలంటే మీరు తప్పక దర్శించవలసిన ప్రదేశం కేరళ.
మీకు అరణ్యాల స్వచ్చతలో తేలియాడుతూ ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని రుచి చూడాలని ఉందా? మీలో అనంత కాలం నుంచి ఉన్న ప్రశ్నలకు ఇక్కడి అంతుచిక్కని పర్వతాలు సమాధానం చూపిస్తాయి. ఇక్కడి జీవితంలోని స్వేచ్ఛ, ఉత్తేజం మీకు కొత్త శక్తిని ఇస్తాయి. ఇక్కడి బద్దకంగా కదిలే కలువలతో పాటు మీ జీవితం సాగిపోతుంది. ఇక్కడి నాటు పడవలలో మీ జీవితపు కొత్త ప్రయాణం మొదలవుతుంది. ఇక్కడి వింతైన చెక్క వంతెనల క్రింద మీరు జీవితంతో సరికొత్త సంభాషణ ప్రారంభిస్తారు. సుదూరపు దీవులలో నిజమైన బ్రతుకులు మిమ్మలను పలకరిస్తాయి.
ఇక్కడి నిత్యజీవితాలలో ఒక మార్మికత కనిపిస్తుంది. అతి మామూలు విషయాలలో అనంతాన్ని చూడవచ్చు. ఇక్కడ భువి పైన నడయాడే దేవతలు, స్వర్గంలో జీవించే మనుష్యులు పక్కపక్కనే కనిపిస్తారు. మీరు హృదయంతో వినగలిగితే ఇక్కడ నిశ్శబ్దమే సంభాషణ అవగలదు. ఇక్కడ మీరు చెట్లతో, నింగితో, భూమితో, సమస్త ప్రకృతితో మమేకం అవగలరు. ఇక్కడి ప్రాచీన వీధులు మిమ్మల్ని సంప్రదాయాలు, నమ్మకాలు, భావజాలాలకి అతీతమైన లోకంలోకి మోసుకు వెళ్తాయి.
భగవంతుడు తాను నివసిస్తున్న స్వర్గానికి నకలును ఈ భూమి మీద కేరళ రూపంలో సృష్టించాడు. అందుకే దీనిని గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తారు. ఇక్కడ కుల మాత వర్ణ భేదాలు వెతికినా దొరకవు. కంటికి కనపడే మేర పచ్చదనం. భారత దేశానికి ఒక చివర ఉన్న ఈ చిన్న రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకత ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న సమతుల్యత. మంచు తెరలు కప్పిన పర్వతాల నుంచి, చిత్రమైన నాట్యాలు చేసే జలపాతాల నుంచి, ఒక్క క్షణం ఊపిరి తీసుకోవడం కూడా మరిచిపోయి చూసే ప్రశాంతమైన backwaters నుంచి, మైళ్ళ కొద్దీ వ్యాపించిన తేయాకు తోటల వరకు,ప్రకృతి సృష్టించిన అందాలను మనిషి మలచిన అద్భుతాలను ఒకే ప్రదేశంలో చూడగలిగే ప్రదేశం కేరళ. ఇన్ని ప్రత్యకతలు ఉండబట్టే కేరళ భూతల స్వర్గమంగా పేరుగాంచి ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.
కేరళలో మనం ఏమి చెయ్యాలి అనే సందేహం మీకు కలగవచ్చు. మున్నార్ లో తేయాకు తోటల్లో విహరిస్తూ లేలేత తేయాకుల వాసనను ఆస్వాదించవచ్చు. తేక్కడి లో ఏనుగులను, పులులను పలుకరించవచ్చు. కోజిఖోడ్ లో కథాకళి కళాకారుల ముఖకవళికలను చూడవచ్చు. కోవళం లో సూర్యోదయం మీకు స్వాగతం పలుకుతుంది. కోచి ప్రాచీన వీధుల్లో విహరిస్తూ చరిత్ర పుటల్లోకి తొంగి చూడవచ్చు. కుమారామ్ లో ప్రశాంత జలాల్లో నౌకా విహారం చేయవచ్చు. తిరువనంతపురం లోని అద్భుత దేవాలయాల నుంచి మీ చూపుని మరల్చుకోలేరు. వరకల బీచ్ లోని ఇసుకలో మీ పాద ముద్రలు విడవచు. అలెప్పి లోని ప్రకృతి లో మునిగి తేలవచ్చు. మీరు కాలక్షాపాన్ని కోరుకున్నా, సాహసకృత్యాలని కోరుకున్నా, స్వాంతన కావాలన్నా, జ్ఞానం కావాలన్నా కేరళ మీకు అసలైన గమ్యస్థానం.
పశ్చిమ కనుమలు, అరేబియా సముద్రం మధ్య ఉన్న ఈ చిన్న భూభాగం పచ్చని వరి, కొబ్బరి. అరటి పంటలతో అలరారుతూ ఉంటుంది. భారత దేశంలో రుతుపవనాలు మొదట ఇక్కడి నేలనే తడిపి మిగతా దేశాన్ని పలకరిస్తాయి. రకరకాల సుగంధ ద్రవ్యాలు, ఆయుర్వేద మసాజులు, హౌస్ బోట్లు, నోరూరించే వంటకాలు ఇక్కడి ఇతర ప్రత్యేకతలు.
“దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్” అన్నాడు మహాకవి గురజాడ. ఏ ప్రాంతానికైనా ప్రత్యేక అందం తెచ్చేది అక్కడ జీవించే మనుషులు. కేరళ లో నివసించే మనుషులు అత్యంత సాధారణ జీవితం గడిపే మట్టి మనుషులు. వీరిలో ఎక్కువ మంది పట్టణ జీవితంలోని జిలుగు వెలుగులకు దూరంగా తమ మట్టికి ప్రాచీన సంప్రదాయాలకు దెగ్గరకు జీవిస్తారు. కేరళ వాస్తవ్యులు తమ ప్రాచీన జీవన విధానాన్ని, పద్దతులను, మత సాంప్రదాయాలను ఎప్పుడు మార్చిపోరు. వారు తమ వారసత్వ సంపదను తమ ఆస్తిగా భావిస్తారు. వీరి జీవిత విధాన అత్యంత సరళమైనది. అందువలన వీరు అత్యంత సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తారు.
ఇక్కడి మనుషులు శ్రమ జీవులు. ఇక్కడ దొరికే స్వచ్ఛమైన నీరు, గాలి, పండ్లు, కూరలు వీరిని ఆరోగ్యముగా ఉంచుతాయి. వీరు చాలా నియమబద్ధంగా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. కేరళకి ఉన్న మరొక ప్రత్యేకత ఇక్కడి అక్షరాస్యత. భారత దేశంలో అత్యంత ఎక్కువ అక్షరాస్యులు ఉన్న రాష్ట్రం ఇది. ఈ చదువు సంస్కారం ఇక్కడి ప్రజల మాటలో నడతలో అడుగడుగునా కనిపిస్తుంది. ప్రత్యేకించి పర్యాటకుల మీద వీరు చూపించే ప్రేమాభిమానాలు మాటల్లో చెప్పలేనిది.
కేరళ కి ఉన్న ఇంకొక ప్రత్యేకత స్త్రీలకు ఇచ్చే ప్రాముఖ్యత. ఇది భారత దేశం మొత్తంలో మనకు కనిపించినా, కేరళ మహిళా సాధికారతకు పెట్టింది పేరు. ఇక్కడి స్త్రీ పురుష జనాభా నిష్పత్తి సమానం. ఇది మనకు ఒక్క కేరళ లోనే కనిపిస్తుంది.
కేరళ భిన్నత్వంలో ఏకత్వానికి పెట్టింది పేరు. ఇక్కడి జనాభాలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కనిపిస్తారు. కానీ వీరందరూ ఐక్యంగా ఎటువంటి కలహాలు లేకుండా జీవిస్తారు. మనకి దాదాపు ప్రతి వీధిలో గుళ్ళు, మసీదులు, చర్చిలు కనిపిస్తాయి. ప్రపంచంలో అతి కొద్దీ ప్రాంతాలలో ఉండే యూదులు మనకి కేరళ లోని కోచి నగరంలో కనిపిస్తారు. సైనాగోగ్ గా పిలవబడే వీరి ప్రార్ధన స్థలం కూడా ఈ నగరంలో ఉండడం విశేషం.
పర్యాటకులను కేరళలో ముఖ్యంగా ఆకర్షించేది అక్కడి ప్రజలలో నిండి ఉన్న ప్రేమాభిమానాలు. ఈ ప్రేమ సాటి మనుషుల మీదనే కాదు, ప్రకృతి మీద కూడా. ఇక్కడికి వచ్చే సందర్శకులను ఎంత ఆదరిస్తారో అంత కన్నా ఎక్కువగా తమ నేలను, అక్కడ ఉన్న ప్రకృతిని ప్రేమిస్తారు. అందుకే వారి జీవితమే ప్రకృతితో సహజీవనం. పర్యావరణహిత అభివృద్ధి, ఎకోటూరిజం -ఈ రెండు పదాలకు నిలువెత్తు ఉదాహరణ కేరళ. ఇది ఇక్కడి ప్రజల నిస్వార్ధ జీవన విధానం వల్లనే సాధ్యమైనది.
ఇంకెందుకు ఆలస్యం! మధురమైన ఫలాలని, ఔషధ లక్షణాలున్న సుగంధ ద్రవ్యాలను, అరుదైన అడవి జంతువులను, స్వచ్ఛమైన ప్రకృతిని, అంతకన్నా స్వచ్ఛమైన కల్మషం లేని మనుషులను చూడాలనుకుంటే వెంటనే మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో కేరళ కు బయలుదేరండి. భూలోక స్వర్గం, అక్కడి దేవతల లాంటి మనుషులు మీకు స్వాగతం చెప్పడానికి ఎదురు చూస్తున్నారు.
This post is sponsored by Kerala Tourism
Източник за тази статия
Наши спонсори са:
Български трактори на добри цени при изключително качество
Leave a Reply
You must be logged in to post a comment.